హిమాచల్ ప్రదేశ్‌లోని మండీ ఎంపీ, బీజేపీ నేత రామ్ స్వరూప్ శర్మ (62) బుధవారం ఢిల్లీలోని తన నివాసంలో మృతి చెందారు. ఆయన హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్వరూప్ శర్మ తన ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఉదయం ఆయన వ్యక్తిగత సహాయకుడు ఫోన్ చేయగా..శర్మ లిఫ్ట్ చేయలేదు. దీంతో అనుమానం వచ్చి ఆయన పోలీసులకు ఫోన్ చేశారు. నివాసానికి వెళ్లిన పోలీసులు, గది తలుపులు బద్దలుకొట్టగా..ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించారు. దీంతో పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. సంఘటన స్థలంలో పలు ఆధారాలను సేకరించిన పోలీసులు అనంతరం..పోస్టుమార్టం నిమిత్తం ఎంపీ మృతదేహాన్ని గోంతీ అపార్ట్‌మెంట్స్ నుంచి ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న కేంద్ర సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్ అక్కడకు చేరుకుని పోలీసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. 2014 లో ఆయన తొలిసారిగా పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. విదేశీ వ్యవహారాల స్టాండింగ్ కమిటీల సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులున్నారు. రామ్ స్వరూప్ శర్మ మృతి ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. గత నెలలో దాద్రా అండ్ నగర్ హవేలీ ఎంపీ మోహన్ దేల్కర్ ఓ హోటల్ గదిలో మృతిచెందారు. ఎంపీ ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావించారు.