ప్రభుత్వ భూములమ్మటం, ప్రజల నుంచి పలు ఛార్జీల పేరుతో డబ్బు గుంజటం.. కొత్త అప్పులు చేయటం.. వీటన్నింటినీ సమర్థించేసుకోవటం.. గులాబీ సర్కారు పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందో చెప్పేందుకు.. అప్పులు ఒక్కటి చాలు. ప్రస్తుతం 3లక్షల కోట్లకు పైగా చేసిన అప్పులతో.. రాష్ట్రాన్ని గులాబీ పార్టీ నిండా ముంచేసింది.. ఇలా అపరిమితమైన అప్పులు భవిష్యత్ లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కేసీఆర్ ప్రస్తుత కళ్లన్నీ.. కొత్త అప్పులు ఎక్కడ తేవచ్చు.. ఎలా తేవచ్చు.. ప్రజలను ఈ విషయంలో మసిపూసి మారేడుకాయ ఎలా చేయచ్చు.. ప్రజలపై ఏయే ఛార్జీల భారం కొత్తగా మోపవచ్చు.. రాష్ట్రంలోని విలువైన భూములు ప్రభుత్వం వద్ద ఏమేమి ఉన్నాయి.. వాటిని ఎలా తెగనమ్మవచ్చు.. వంటివాటిపై.. 2021-22 బడ్జెట్ కు కేసీఆర్ దిశానిర్దేశం చేస్తున్నారు. బడ్జెట్ అంచనాలు గతంలో కంటే ఎక్కువగా ఉంటాయని.. కేసీఆర్ ఇప్పటికే హింట్ ఇచ్చేశారు. దీంతో..ఈసారి తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2 లక్షల కోట్లు దాటేలా స్పష్టంగా కనిపిస్తోంది. మరి ఇంత భారీ బడ్జెట్ కు నిధులు ఎక్కడినుంచి తెస్తారనేగా మీ అనుమానం.. సింపుల్..అప్పులు.. కొత్త అప్పులు.. మళ్లీ అప్పులు చేయటమే దీనికి రాయల్ రూట్.
ఇప్పటికే ఉన్న 3 లక్షల కోట్లకు పైగా అప్పులు చాలవన్నట్టు.. గులాబీ సర్కారు మళ్లీ భారీమొత్తంలో కొత్త రుణాలు తీసుకునేందుకు జోరుగా సిద్ధమవుతోంది. కోకాపేటలో ఉన్న 100 ఎకరాల భూములను, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములను అమ్మాలనే యోచనలో సర్కారున్నట్టు లీకులు బలంగా వస్తున్నాయి. భూముల మార్కెట్ విలువ, కరెంట్ చార్జీలను పెంచే ప్రయత్నాలు కూడా చేస్తోంది. కరోనా వైరస్ తో ఆర్థిక పరిస్థితులు తలకిందలు కావటం, లాక్ డౌన్ కారణంగా.. ప్రజల ఆర్థిక స్థితిగతులు స్థంభించిపోయి.. ప్రభుత్వ ఖజానా కుదేలైంది. దీంతో సుమారు 50 వేల కోట్లకుపైగా రాష్ట్ర ఖజానాకు రాబడి తగ్గినట్టు ఆర్థిక శాఖ చెబుతోంది. ఈ క్రమంలో రాష్ట్రాలకు వెసులుబాటు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బీఎం పరిధిని 4 నుంచి 5 శాతానికి పెంచటం కొంతమేరకు కలిసి వచ్చింది. దీంతో.. అదనంగా మరో 20 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకునే అవకాశం.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కింది. దీంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి రాష్ట్ర ప్రభుత్వం 43వేల 9వందల 37 కోట్ల అప్పులు తీసుకుంది. మార్చి నెల ముగిసే సరికి అది 50 వేల కోట్లకు చేరుతుంది.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచీ ప్రభుత్వం నేరుగా చేసిన అప్పులు, కార్పొరేషన్ల పేరుతో చేసిన అప్పులన్నీ కలిపి 3.20 లక్షల కోట్లుపైమాటే. కేంద్రం ఎఫ్ఆర్బీఎం పరిమితిని పెంచడంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపు 54 వేల కోట్ల రూపాయల వరకు అప్పులు చేసే అవకాశం ఉందని ఫైనాన్స్ వర్గాలు చెప్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం చివరి నాటికి రాష్ట్ర అప్పులు దాదాపు 4 లక్షల కోట్ల వరకు చేరొచ్చని మేధావులు, విపక్షాలు నోటి లెక్కలు వేస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కిస్తీల భారమే 17 వేల కోట్లకు చేరుకుందంటే మనరాష్ట్ర ఆర్థిక పరిస్థితి భవిష్యత్ ఏమిటంటారు. మరోవైపు..హెచ్ఎండీఏ.. ఇటు హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములను అమ్మి 20 వేల కోట్ల రూపాయల వరకు నిధులను సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇదంతా చాలదన్నట్టు.. అతిత్వరలో.. కరెంట్ చార్జీలను పెంచే కసరత్తు చేస్తోంది. కానీ ఎన్నికలుండటంతో.. వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు ముగిసిన వెంటనే విద్యుత్ చార్జీలను పెంచే చాన్స్ ఉంది. వాస్తవానికి గత ఏడాదే కరెంట్ చార్జీలను పెంచాలని ప్రభుత్వం భావించింది. సీఎం కేసీఆర్ కూడా అసెంబ్లీలో దీనిపై ప్రకటన చేశారు. ఈలోపే కరోనా రావడం, లాక్ డౌన్ విధించడంతో చార్జీల పెంపు ఆలోచనను ప్రభుత్వం విరమించుకుంది.
ఉమ్మడి రాష్ట్రంలో 2013 లో భూముల ధరలను సవరించారు. అప్పట్నుంచి అవే ధరలు అమలవుతున్నాయి. ధరణి పోర్టల్ ను అమలు చేసే సమయంలోనే భూముల మార్కెట్ వ్యాల్యూను సవరించాలని ప్రభుత్వం భావించింది. కానీ అప్పటికే రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంతో ప్రజల నుంచి ఒత్తిడి పెరిగింది. దీంతో ధరల పెంపు ఆలోచనను వాయిదా వేసింది. కానీ 2021–-22 ఆర్థిక సంవత్సరంలో మాత్రం భూముల మార్కెట్ విలువను పెంచే ప్రయత్నాల్లో కేసీఆర్ ప్రభుత్వం ఉంది. రిజిస్ట్రేషన్ ఆదాయాన్ని భారీగా పెంచుకునేందుకే ఇదంతా చేస్తోంది. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రతి నెల సగటున 700 కోట్ల రూపాయల ఆదాయం వస్తుండగా.. ప్రతినెలా మరో 50 శాతం అదనపు ఆదాయం వచ్చేలా వచ్చే ఆర్థిక సంవత్సరంలో భూముల మార్కెట్ విలువను సవరించే అవకాశం స్పష్టంగా ఉంది.